మాకు భాష రాదంటరు
మాది భాషే కాదంటరు
అన్నతమ్ముల లెక్క ఉందాం అంటరు
తమ్ముడికి దమ్మిడి కూడా మిగల్చకుండా గుంజుకతింటరు
జలయగ్నమని నిధులు కేటాయించినమని చెప్తరు
ఏ నీళ్ళు లేక కన్నీళ్ళే మిగిలిన రైతు గోడుని మాత్రం పట్టిచ్చుకోరు
ఫ్లోరైడ్ బాధితులకి గుక్కెడు మంచినీళ్ళు లేవు
ఫార్మ కంపెనీలు పెట్టి అభివృద్ధి చేసినమని ప్రగల్భాలు పల్కుతరు
మాకు బతకడం రాదంటరు
మాకు బతకడం నేర్పించినమని చెప్పుకుంటరు
ఇంకెన్ని చేస్తరు ఇంకేమి ఇస్తరు
ఇగ మా బతుకు మేము బతుక్కుంటo అంటే బతకనియ్యరు
దొరల పెత్తనం మళ్ళొస్తది నక్సలిజం పెర్గుతదని బూచి చూపిస్తరు
వలసవాదులే దోపిడీ దొంగలై పెత్తనం మాత్రం చెలాయిస్తరు
కలిసుంటే కలదు సుఖం అని నీతి వాక్యాలు జపిస్తరు
ఇన్నేళ్ళకెల్లి ఈ ప్రేమ ఏమైందని అడిగితె మొఖం చాటేస్తరు
మేము మా హక్కుల కోసం విడిపోతమంటే కరుడు కట్టిన వేర్పాటు వాదం
మీరు మద్రాసుకెళ్ళి విడిపోతే అది తెలుగోడి ఆత్మగౌరవం
మంచిగుంది మంచిగుంది అన్నయ్యల సామాజిక న్యాయం
జర జాగ్రత్త అన్నా పెరిగిందిప్పుడు తమ్ముల్లల్ల చైతన్యం
కలిసుండి దూరమయ్యే కన్న విడిపొయ్యి కలిసుండుడే నయం
తెలంగాణా రాష్ట్రం సాధించుకునుడు ఇంక ఖాయం
జై తెలంగాణా
No Response to "విడిపొయ్యి కలిసుందాం"
Leave A Reply