Saturday, March 13, 2010

నిజాం తలవంచిన రోజు

Posted on 7:54 AM by telangana yuvasena

చుట్టుపట్ల సూర్యపేట
నట్టనడుమ నల్లగొండ
ఆవాల హైద్రాబాదు
తర్వాత గోలకొండ
గోలకొండ ఖిల్లా కింద- నీ
గోరి కడ్తం కొడుకో
నైజాము సర్కరోడా! (- యాదగిరి)

దశకంఠుని నిధనం కోసం కోదండనారీ నిధ్వానం జరిగింది. శిశుపాలుని శిరసు కోసం సుదర్శనం బయలుదేరింది… 1948 సెప్టెంబర్‌ 13 (సోమవారం) బ్రాహ్మీ ముహూర్తాన… భారత సేన హైదరాబాద్‌ సంస్థాన విమోచన కోసం పథ సంచలనం ప్రారంభించింది. ‘ఉక్కు మనిషి’ సర్దార్‌ పటేల్‌ మార్గదర్శనం, లెఫ్టినెంట్‌ మేజర్‌ జనరల్‌ మహరాజ్‌ రాజేంద్రసింగ్‌ నిర్దేశకత్వంలో మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వాన జరిగింది ఈ ‘పోలీసు చర్య’. చౌధరి సేనలతో షోలాపూర్‌ నుంచి బయలుదేరారు. బొంబాయి సెక్టార్‌లో కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఎల్‌.ఎస్‌. బ్రార్‌, మద్రాస్‌ సెక్టార్‌లో ఆపరేషన్స్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఎ.ఎ. రుద్ర, బేరార్‌ సెక్టార్‌లో బ్రిగేడియర్‌ శివదత్‌ సింగ్‌ ఆయనకు సహకరిస్తున్నారు. ఎయిర్‌ వైస్‌మార్షల్‌ ముఖర్జీ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యూనియన్‌ సేనలు మొత్తం ఎనిమిది విభిన్న ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ సంస్థానాన్ని ముట్టడించాయి. అయితే ప్రధానమైన ముట్టడి షోలాపూర్‌, బెజవాడల నుంచే. భారత సేనల వ్యూహమేమిటో నిజాం సేనలకు అంతే పట్టలేదు. ఎర్రకోట మీద అసఫియా పతాకాన్ని ఎగరేస్తామని బోరవిరిచి బీరాలు పలికిన వారు కనీసం భారత సేనలను నిలువరించలేకపోయారు. ఎక్కడా పెద్ద ప్రతిఘటన లేదు. ఒక్క నల్‌దుర్గ్‌లో తప్ప. భారత సేనలు వెంటతెచ్చిన అధునాతన శకటాలూ యుద్ధవిమానాలూ నిజాం సైన్యాన్ని పూర్తిగా స్థైర్యం కోల్పోయేలా చేశాయి. చాలాచోట్ల నిజాం సైనికులు ఆయుధాల్ని పారేసి పారిపోయారు. కొన్నిచోట్లయితే వాళ్ల తికమకతో స్వపక్షంమీదే కాల్పులు జరుపుకున్నారు, ఫస్ట్‌ నిజాం ఇన్‌ఫాంట్రీ మీద ఘట్‌కేసర్‌ దగ్గర లెఫ్టినెంట్‌ అహ్మద్‌ అలీ ఇట్లా అయోమయంలో కాల్పులు సాగించాడు. పారిపోతున్నప్పుడు ఇన్నాళ్లూ హింసలకు గురైన పల్లెజనం నిజాం సైనికులను వెంటబడి తరిమారు. చాలాచోట్ల వాళ్లకి దేహశుద్ధి జరిగింది. మొదటిరోజు జరిగిన యుద్ధంలో ఏడుగురు భారత సైనికులు మరణించగా 632 మంది నిజాం సైనికులు వధించబడ్డారు. మొదటిరోజే నల్దుర్గ్‌ భారత సేనల వశమైంది, ఆ తర్వాత ఆదిలాబాద్‌, జల్కోట్‌లు భారత దళాల అధీనంలోకి వచ్చాయి. తల్మాడ్‌, తిరూరి ప్రాంతాలు సైతం భారత బలగాల పరమైనాయి. మునగాల మీద దాడి చేసినప్పుడు నిజాం సేన ప్రతిఘటించింది. అయితే అది ఎక్కువసేపు సాగలేదు. అదేరోజు ఉస్మానాబాద్‌ జిల్లాకి చెందిన తుల్జాపూర్‌, పర్బణీ జిల్లాకి చెందిన మానిక్‌ గఢ్‌, కనౌడ్‌గావ్‌, బెజవాడ వైపున్న బోనకల్లు భారత సేనల వశమమ్యాయి. ఆనాడే ఔరంగాబాద్‌లోని జాల్నా దారిన యూనియన్‌ బలగాలు ముందుకు సాగిపోయాయి. వరంగల్‌, బీదర్‌లలోని విమానాశ్రయాల మీద బాంబింగ్‌ జరిగింది. సైనికచర్య దృష్ట్యా హైదరాబాద్‌- బెజవాడ మధ్యనున్న ట్రంక్‌ టెలిఫోన్‌ తప్ప భారత్‌- హైదరాబాద్‌ మధ్యగల రాకపోకలనన్నిటినీ నిలిపివేశారు. రెండోరోజున సెప్టెంబర్‌ 14 నాడు దౌలతాబాద్‌, జాల్నా యూనియన్‌ పరమయ్యాయి. దాంతో ఔరంగాబాద్‌ తేలిగ్గానే చేజిక్కింది. చౌధరి నేతృత్వంలోని సేనలు పురోగమిస్తూ రాజేశ్వర్‌కి చేరాయి. అది సరిగ్గా షోలాపూర్‌- సికింద్రాబాద్‌ పట్టణాలకి మధ్యన ఉంటుంది. ఉస్మానాబాద్‌, నిర్మల్‌ చాలా తేలిగ్గా పట్టుబడ్డాయి. దక్షిణాన ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల ప్రతిఘటన స్వల్పంగానే ఉండింది. సికింద్రాబాద్‌ నుంచి 60 మైళ్ల దూరాన ఉన్న సూర్యాపేట దగ్గర భారత సేనలు ముందడుగు వేస్తున్నాయి. రెండోనాడు కూడా వరంగల్‌, బీదర్‌ విమానాశ్రయాలపై బాంబింగ్‌ జరిగింది. సెస్టెంబర్‌ 15 నాడు మూడోరోజున తెల్లవారుజామున 4 గంటలకి మురాద్‌లోని నిజాం సైన్యం లాతూర్‌ రోడ్డువైపు తిరోగమించింది. లాతూర్‌ నుంచి జహీరాబాద్‌కి రైల్లో బయలుదేరిన హైదరాబాద్‌ సెంకడ్‌ ఇన్ఫంటరీ సైనికులమీద విమానాల నుంచి బాంబులు కురిసాయి. దీంతో నిజాం సైన్యం ఉక్కిరిబిక్కిరయింది. చేసేదిలేక ఈ బ్యాటరీ సైనికులు రైలెక్కి హైదరాబాద్‌కి బయలుదేరారు. రైలు వికారాబాద్‌ స్టేషన్‌కి చేరగానే ఈ దళం వెంటనే జహీరాబాద్‌ తిరిగివెళ్లి అక్కడ యుద్ధం సంగతి చూడాలని ఆజ్ఞ వచ్చింది. అయితే ఈ దళం దగ్గర మరఫిరంగులు లేవు. వీళ్లంతా జహీరాబాద్‌కి వెళ్లి మాత్రం చేసేదేమిటి? వెళితే చావు తప్పదని తలచి హైదరాబాద్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ ఆజ్ఞను ధిక్కరించి ఈ దళం హైదరాబాద్‌కే వెళ్లింది. వాయువ్యంలో ఔరంగాబాద్‌, షోలాపూర్‌- హైదరాబాద్‌ లైన్‌లోని హుమ్నాబాద్‌ యూనియన్‌ దళాల వశమయ్యాయి. జాల్నా నుంచి దక్షిణాన 40 మైళ్ల దూరాన షాదన్‌ దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన బ్రిడ్జీ కూడా భారత బలగాల పరమైంది. వరంగల్‌ జిల్లాలో అర్తర్భాగంగా ఉన్న ఖమ్మం సైతం భారత సేనల ఆధీనమైంది. బీదర్‌ విమానాశ్రయం మీద బాంబింగ్‌ జరిగింది. సెప్టెంబర్‌ 16నాడు నాల్గవ రోజు జహీరాబాద్‌ క్రాసింగ్‌ దగ్గరున్న రోడ్డును నిజాం సైన్యం పేల్చివేసింది. భారతదళాల ధాటిని తట్టుకోలేక అక్కడినుంచి తిరోగమిస్తూ నిజాం సైనికులు ఎఖ్‌లీ వంతెనను పేల్చివేశారు. అయితే సాపర్ల సహాయంతో ఈ వంతెనని తిరిగి యూనియన్‌ సైనికులు కట్టారు. అక్కడి నుంచి పురోగమిస్తూ ముఖ్య రైల్‌, రహదారి కూడలి అయిన జహీరాబాద్‌ టౌన్‌ను వశం చేసుకుంది. ఆరోజే పర్బణీ జిల్లాలోని హింగోలీ పట్టణంమీద దాడి జరిగింది. ఇటు సూర్యాపేట నుంచి యూనియన్‌ సైన్యం హైదరాబాద్‌ దారిన వస్తూ ఉంటే సూర్యాపేటకి నాలుగు మైళ్ల దూరాన మూసీ నదిపై ఉన్న వంతెనని నిజాం సైన్యం పేల్చివేసింది. అయితే, మద్రాసు సాపర్స్‌ సాయంతో భారత దళాలు బ్రిడ్జీని పునర్నిర్మించాయి. సుటెర్‌ దిశన మునీరాబాద్‌ రైల్స్స్టేషన్‌ను భారత బలగాలు తమ వశం చేసుకున్నాయి. అక్కడ భారత సేనలకు భారీఎత్తున ఆయుధాలూ మందుగుండు సామగ్రీ దొరికాయి. చాలామంది రజాకార్లూ చిక్కారు. సెప్టెంబర్‌ 17న ఐదవరోజు హైదరాబాద్‌ దళాలు భారతీయ సేనల్ని రానీయకుండా చేయటానికి పటన్‌చెరు దగ్గరి బ్రిడ్జీని పేల్చివేశాయి. రోడ్డుమీద పెద్ద ఎత్తున మందుపాతరలు పెట్టి గచ్చిబౌలి, లింగంపల్లి మధ్యకు చేరుకున్నాయి. మల్కాపూర్‌ దగ్గర కూడా మందుపాతరలు అమర్చారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు నిజాం యుద్ధవిరమణని ప్రకటించి యూనియన్‌ సేనలను సికింద్రాబాద్‌లోకి స్వేచ్ఛగా రావడానికి అనుమతించాడు. సెప్టెంబర్‌ 18నాడు సాయంత్రం 4 గంటలకు ప్రజలంతా హారతులిస్తూ విజయతిలకాలు దిద్దుతూ హర్షాతిరేకాన స్వాగతిస్తుండగా భారతసేనలు సికింద్రాబాద్‌లోకి అడుగుపెట్టాయి. మేజర్‌ జనరల్‌ చౌధరి ఎదుట నిజాం సైన్యాధ్యక్షుడు అహ్మద్‌ అల్‌ ఎడ్రూస్‌, నిజాం యువరాజు ఆజంజా అసఫియా పతాకాన్ని దింపి లాంఛనంగా లొంగిపోయి శరణువేడారు. ఇక్కడితో పోలీసుచర్య పూర్తయింది. మొత్తం అంతా కలిపి 108 గంటల్లోనే హైదరాబాద్‌ సంస్థానం యూనియన్‌ వశమైంది. హైదరాబాద్‌మీద దాడిచేస్తే మద్రాసు, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తానన్న రజ్వీ తోకముడిచాడు. అతడి అనుచరులూ మద్దతుదారులూ పిక్కబలం చూపారు. పెద్ద రక్తపాతమేదీ లేకుండానే నిజాం రాజ్యం విముక్తమయింది.

రెండు వందల యేండ్ల చరిత్రపుటల
కప్పు కొనియున్న గాఢాంధకార మెల్ల
కొట్టుకొనిపోయె, తూరుపు మిట్టనుండి
పారి వచ్చిన వెలుతురు వాగులోన
మూడవ పాలు తెల్గు పటమున్‌ తన పాలికి కత్తిరించు కొ
న్నాడు కదా నిజాము నరనాధుడు మున్నొక- రెండు మూడు నూ
ర్లేడుల నాడు! వాడు తొలగించిన ఆంధ్ర మహాపతాక క్రీ
నీడలు నాగుపాములయి నేటికి కాటిడె వాని వంశమున్‌ (దాశరథి)


No Response to "నిజాం తలవంచిన రోజు"

Leave A Reply